03/11/2024
"నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి" అని ఒక మహా కవి చెప్పిన మాటలను మళ్ళీ మళ్ళీ నిజం చేసే సినిమా "సత్యం సుందరం". తమిళ పేరు "Meiyazhagan" తోనే Netflix లో చూడగలం.
పెద్ద ఆర్భాటాలు లేకుండా, మందలు మందలుగా డ్యాన్సులూ, ఫైట్లూ లేకుండా సాఫీగా సాదాగా నడిచిపోయే సినిమా.
బంధువుల మోసం వల్ల మొత్తం ఆస్తి, అందులో ఎంతో ప్రేమించే ఇల్లూ పోగొట్టుకుని, ఆ బాధ బరువుని పాతికేళ్ళు నిశ్శబ్ధంగా మోసిన పాత్రలో అరవింద స్వామి... వాళ్లపట్ల ద్వేషం లేకపోయినా, అసహ్యంతో కూడిన కోపం... అంత బాధ లో కూడా వాళ్ళని ఏమీ అనకుండా.. ఊరు వదిలి వెళ్ళిపోయి ఇష్టం లేకపోయినా చెల్లెలి పెళ్ళి కోసం మళ్ళీ రావడం... అప్పుడు పేరు తెలియకపోయినా కార్తీ పరిచయం, అందులో ప్రేమ ఆప్యాయతల్లో కరిగిపోవడం ఒక అద్భుత కావ్యం.
ఒక్కో పాత్రనీ చూస్తే మనకు కూడా ఇలాంటి కొడుకునో, తండ్రినో, అన్ననో అయితే బాగుంటుందనిపిస్తుంది... నాకు కూడా ఇలాంటి బావలో, మరదలో, చెల్లెలో ఉంటే బాగుండనిపిస్తుంది. ఒక్కో సన్నివేశంలో మనకి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి... అవి బాధ వల్ల వచ్చాయో, ఆనందం వల్లో, ఆర్తి వల్లో... మనకి అర్థం కాదు. తెర మీద కథ వేరు, మనం వేరు అనిపించదు... ఆ కథలో మనం కూడా పాత్రలే. సినిమా చూస్తున్నంత సేపూ మన జీవిత కథలో సన్నివేశాలే కనబడతాయి... ఏ సినిమా పడితే అది part 1, part 2 అని తీస్తున్న ఈ రోజుల్లో "అప్పుడే అయిపోయిందా.. ఇంకొంచం చూపించొచ్చు కదా?" అని అనిపిస్తుంది. చివరికి మనకే ఏదో అసంతృప్తిగా వెలితిగా కూడా ఉంటుంది. అన్నీ మనకి తెలిసిన పరిసరాలూ, మనుషులూ, బంధాలూ అని పెద్దవాళ్ళు అనుకుంటే, అవన్నీ ఎంత మధురంగా ఉంటాయో చిన్నవాళ్ళకి పరిచయం చేస్తుంది. కొందరికి జీవిత పాఠం అయితే కొందరికి బయటకు రాలేని, మరిచిపోలేని ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. "సత్యం" ఎప్పటికీ "సుందరం" గానే ఉంటుంది. - C.R. విజయ సారథి.